ఇరాన్ లో దారుణం చోటు చేసుకున్నది. బాలికలు పాఠశాలల కు వెళ్లకుండా ఉండేందుకు వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం జరిగింది. క్వామ్ సిటీలో ఈ దారుణం చోటు చేసుకుందని డిప్యూటీ మంత్రి యోన్స్ పనాహి ధ్రువీకరించారు. పవిత్ర నగరం క్వామ్ సిటీతో పాటు చాలా చోట్ల బాలికల పాఠశాలలను మూసివేయాలని కొందరు వ్యక్తులు వందలాది మంది బాలికలకు విషం కలిపారని మంత్రి పేర్కొన్నారు. గతేడాది నవంబర్ నుంచి అనేక మంది బాలికలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో ఆసుపత్రి పాలయ్యారని చెప్పారు. టెహ్రాన్‌కు దక్షిణాన ఉన్న సిటీలో విద్యార్థినులపై విష ప్రయోగం జరిగినట్లుగా నిర్ధారించారు. అయితే, ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని, ప్రభుత్వం విచారిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇరాన్‌లోని నాలుగు నగరాల్లోని 14 పాఠశాలల్లో చదవుతున్న బాలికలే లక్ష్యంగా చేసుకున్నారన్నారు. నాలుగు నగరాల్లో వాయువ్య నగరం అర్డెబిల్, రాజధాని టెహ్రాన్, పశ్చిమ నగరం బోరోజార్డ్‌తో పాటు క్వామ్ సిటీలో జరిగిందన్నారు. విష ప్రయోగానికి కారణాలపై ఇంటెలిజెన్స్, విద్యాశాఖ వర్గాలు ఆరా తీస్తున్నాయని ప్రభుత్వ ప్రతినిధి అలీ బహదూరీ తెలిపారు.