విద్యార్థి వీసా నిబంధనలను ఆస్ట్రేలియా కఠినతరం చేసింది. తద్వారా అంతర్జాతీయ విద్యా మార్గాలపై కఠిన ఆంక్షలు విధిస్తున్న అమెరికా, కెనడా సరసన ఆస్ట్రేలియా కూడా చేరింది. ఆస్ట్రేలియాలోని ఫెడరేషన్ యూనివర్సిటీ, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, విక్టోరియా యూనివర్సిటీ, సదరన్ క్రాస్ యూనివర్సిటీ సహా పలు విశ్వవిద్యాలయాలు భారత్‌లోని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, జమ్మూకశ్మీర్ రాష్ర్టాల విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణను తాత్కాలికంగా నిలిపివేశాయి.

విద్యార్థి వీసా వ్యవస్థ దుర్వినియోగాన్ని అరికట్టాలన్న లక్ష్యంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా ఈ ఆంక్షలు విధించారు. ఈ పరిణామం భారత్‌లోని, ముఖ్యంగా గుజరాత్‌లోని వీసా కన్సల్టెంట్లు, విద్యార్థుల్లో అశాంతిని సృష్టించింది. ఉన్నత విద్య కోసం గుజరాత్ విద్యార్థులు ఆస్ట్రేలియాను అత్యున్నత గమ్యస్థానంగా పరిగణిస్తుండటమే ఇందుకు కారణం. విదేశాల్లో చదువుకోవాలనుకునే గుజరాత్ విద్యార్థుల్లో దాదాపు 20% మంది ఆస్ట్రేలియాను ఎంచుకుంటున్నట్టు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు చెప్తున్నారు. కానీ, ఇప్పుడు ఆస్ట్రేలియా కొత్త ఆంక్షలు విధించడం వల్ల ఇకపై గుజరాత్ నుంచి ఆ దేశానికి వెళ్లాలనుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గవచ్చని వారు అంచనా వేస్తున్నారు.
