వందేళ్లకుపైగా తమ మ్యూజియంలో భద్రపరిచిన నాగా తెగల కు చెందిన 39 మంది పూర్వీకుల అవశేషాలను యూకే లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తిరిగి అప్పగించింది. పిట్ రివర్స్ మ్యూజియంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫోరం ఫర్ నాగా రికన్సిలియేషన్, నాగా హోహో సంస్థలకు ఈ అవశేషాలను అధికారికంగా అందజేసింది. వాటిని నాగాలాండ్ కు తరలిస్తున్నట్లు ఎఫ్ఎన్ఆర్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ అప్పగింతను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి, నాగా ప్రజలకు మధ్య ఉన్న సంబంధాల్లో ఓ చరిత్రాత్మక ఘట్టంగా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఐరీన్ ట్రేసీ అభివర్ణించారు. బ్రిటిష్ వలస పాలనలో తన సొంత గ్రామాన్ని ఎలా తగులబెట్టారో ఎఫ్ఎన్ఆర్ ప్రతినిధి వైసియర్ సాన్యు గుర్తుచేసుకున్నారు. ఇదిలావుంటే నాగాలాండ్ రాజధాని కోహిమాలోని నాగా సాలిడారిటీ పార్కు లో ఆ అవశేషాల ఖననం కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.















