అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించారు. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదలవుతున్నది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని బాలకృష్ణ అతిథిగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ…‘అల్లు రామలింగయ్యతో కొన్ని చిత్రాల్లో కలిసి నటించాను. అప్పటి నుంచి అల్లు కుటుంబంతో అనుబంధం ఉంది. మేము కలిసి చేసిన అన్‌స్టాపబుల్స్ షో సక్సెస్ అయ్యింది.నేటితరం దర్శకులు ట్రెండ్‌కు అనుగుణంగా సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. ఇదొక యూత్‌ఫుల్ చిత్రంలా అనిపిస్తున్నది. శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ పాత్రలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమా మంచి విజయం సాధించాలి’ అన్నారు.
‘ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ఈ చిత్రంలో చూపించాం. మధ్య తరగతి యువకుడి క్యారెక్టర్‌లో శిరీష్ కనిపిస్తాడు. యువతకు నచ్చే సినిమా అవుతుంది’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. శిరీష్ మాట్లాడుతూ…‘నాన్న నాతో నిర్మించిన రెండు చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం. దర్శకుడు రాకేష్ ఈ కథను ఆసక్తికరంగా తెరక్కెకించాడు. వెన్నెల కిషోర్, పోసాని, సునీల్ పాత్రలు బాగుంటాయి. అను నటన సినిమాకు ఆకర్షణ అవుతుంది. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా’అన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు పరశురామ్, మారుతి, వశిష్ట, చందూ మొండేటి తదితరులు పాల్గొన్నారు.