నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం అఖండ. ఇందులో బాలయ్యకు జోడిగా ప్రగా జైస్వాల్ నటిస్తుంది. బోయపాటి బాలయ్య కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో నుంచి వస్తున్న సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో జరిగిన అఖండ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా షూటింగులు చేశాం. అఖండ మాత్రమే కాదు ఆ తరవాత విడుదలయ్యే పుష్ప, ఆర్.ఆర్.ఆర్, ఆచార్య ఇలా చిన్నా పెద్దా తేడా లేదు. అన్ని సినిమాలూ బాగా ఆడాలి. ప్రభుత్వ సహాయ సహకారాలు చిత్రసీమకు అందాలన్నారు. బాలయ్య ఓ ఆటంబాబు దాన్ని ఎలా పేల్చాలో బోయపాటికే బాగా తెలుసు. ఆ సీక్రెట్ ఆయన దోచుకోకుండా మా అందరికీ చెప్పాలన్నారు రాజమౌళి అన్నారు.
అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ బాలకృష్ణగారి కుటుంబంతో మా ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉంది. ఆయన నాకు తండ్రిలాంటి వారు. నన్ను బాగా ఇష్టపడే వ్యక్తుల్లో దర్శకుడు బోయపాటి శ్రీను ఒకరు. బాలకృష్ణ, బోయపాటి కలయిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరి ఆన్‌స్టాపబుల్ కాంబినేషన్ అన్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే పూనకం వచ్చేలా అనిపిస్తుంది. బాలకృష్ణ గారి అంత అద్భుతంగా సంభాషణలు చెప్పే వారు ఎవరూ లేరు. ఆయన తెరపై, బయట ఎక్కడైనా రియల్‌గానే ఉంటారు. ఈ సినిమా అఖండ జ్యోతిలా వెలుగునివ్వాలని కోరుకుంటున్నా అని అన్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.