మా ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని పట్టించుకోను అని ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల గురించి బాలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలు శాశ్వత భవనంతో పాటు మరికొన్ని అంశాల గురించి ప్రస్తావించారు. గతంలో మా ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటూ ఫస్ట్ క్లాస్ టికెట్లు వేసుకొని విమానాల్లో తిరిగారు. ఆ డబ్బులు ఏం చేశారు అని ప్రశ్నించారు. మా కు శాశ్వత భవనాన్ని ఇంతకాలం ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు.
తెలంగాణ సర్కారు నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా అని ఎద్దేవా చేశారు. మా శాశ్వత భవనం నిర్మాణానికి మంచు విష్ణు ముందుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించగా నేను అందులో భాగస్వామినవుతా అని బాలయ్య తెలిపారు. అంతేకాదు అందరం కలిస్తే మా కోసం మయసభ లాంటి అద్భుతమైన భవనాన్ని నిర్మించుకోవచ్చని తెలిపారు. దీంతోపాటు ఇది గ్లామర్ పరిశ్రమ మన సమస్యల్ని బహిరంగంగా చర్చించకూడదు అని అన్నారు.