ఆధునిక మానవజాతి చరిత్ర మరువలేని విషాదం. నీటమునిగి వందేండ్లు గడిచినా ఇప్పటికీ ప్రపంచం నోట్లో నానుతున్న పేరు. ఈ ప్రమాదంపై నేటికీ అంతుచిక్కని ప్రశ్నలెన్నో. వీటికి సమాధానాలు కనుగొనేందుకూ ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆర్‌ఎంఎస్ టైటానిక్ అనే సంస్థ ఈ ప్రయత్నాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నది. సముద్రగర్భంలో చిక్కుకున్న టైటానిక్ వద్దకు సాహసయాత్ర చేపట్టనున్నది. టైటానిక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని రానున్న తరాలకు అందించాలనే లక్ష్యంతో శుక్రవారం టైటానిక్ వద్దకు ఓ బృందం బయలుదేరుతున్నది. గత ఏడాది జూన్ 18న టైటానిక్‌ను చూసేందుకు ఐదుగు రు సభ్యుల బృందంతో వెళ్లిన ఓషియన్‌గేట్ టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రమాదం జరిగిన తర్వాత టైటానిక్ వద్దకు వెళ్లేందుకు జరుగుతున్న మొదటి ప్రయత్నం ఇదే కావడం విశేషం.
ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు 2,224 మందితో బయల్దేరిన టైటానిక్ నౌక 1912 ఏప్రిల్ 14న ప్రమాదానికి గురయ్యింది. ఓ మంచుకొండను ఢీకొన్న ఈ భారీ నౌక సముద్రగర్భంలో మునిగిపోయింది. దీని జాడ గుర్తించడానికే 73 ఏండ్లు పట్టింది. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో, కెనెడాలోని న్యూఫౌండ్‌లాండ్ తీరంలో 3,800 అడుగుల లోతులో టైటానిక్ ఉన్నట్టు 1985 సెప్టెంబరు 1న గుర్తించారు. అప్పటినుంచి టైటానిక్‌ను ఒకసారి చూడాలనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నది. ఇప్పటివరకు దాదాపు 250 మంది మాత్రమే టైటానిక్‌ను చూడగలిగారు.