పుట్టపర్తి సాయిబాబా మహత్యం, విశిష్టతను నేటి తరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో సాయివేదిక్ ఫిలింంస్ సంస్థ రూపొందిస్తున్న శ్రీసత్యసాయి అవతారం చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సాయిప్రకాష్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. ఆయనకి ఇది వందో చిత్రం కావడం విశేషం. సాయివేదిక్ ఫిలింస్ పతాకంపై డాక్టర్ దామోదర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి క్లాప్‌నివ్వగా, తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విఛాన్ చేశారు. ఎస్.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయికుమార్, సుమన్, బాబు మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు సాయిప్రకాష్ మాట్లాడుతూ బాబాగారికి 180 దేశాల్లో భక్తులున్నారు. ఆయనతో సన్నిహితంగా గడిపే అదృష్టం నాకు దక్కింది. ఈ సినిమాలో నాలుగొందల మంది నటించబోతున్నారు అని తెలిపారు.
ఈ సినిమాలో తాను మహాలక్ష్మి పాత్రలో నటిస్తున్నారనని అర్చన పేర్కొంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జె.బి.కృష్ణ, ఎడిటర్: ఈశ్వర్ రెడ్డి, ఆర్ట్ : నాగు, సహ నిర్మాత: గోపీనాథ్ రెడ్డి, నిర్మాత డా॥ బి.దామోదర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓం సాయి ప్రకాష్. ఈ కార్యక్రమంలో నటులు అర్చన, కోట శంకర్రావు, అశోక్ కుమార్, పృథ్వీ, శివపార్వతి, సహ నిర్మాత గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.