అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను శ్రీ సాంస్కృతిక కళాసారథి – సింగపూర్ , వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో, అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు సింగపూర్‌లో ఘనంగా నిర్వహించారు.
వంశీ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపకురాలు జయ పీసపాటి, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమం ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి, శుభోదయం గ్రూప్ చైర్మన్ డాక్టర్ శ్రీలక్ష్మీ ప్రసాద్ కలపటపు, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, నిర్వాహకబృంద సభ్యులు శ్రీధర్ భరద్వాజ్, చామిరాజు రామాంజనేయులు పాతూరు రాంబాబు జ్యోతి ప్రకాశనం గావించి ఘంటసాల మాస్టారు చిత్రపటానికి పూవులతో నివాళులు అర్పించారు.
కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి తమ అభినందన వీడియో సందేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమం సింగపూర్‌లో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సింగపూర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత కేంద్ర ప్రభుత్వం తరఫున, ప్రధాని నరేంద్ర మోడీ తరఫున, కార్యక్రమానికి ప్రత్యేక అభినందనలు కూడా అందించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్త అయిన రాధిక మంగిపూడి సభా నిర్వహణ గావించారు. సింగపూర్‌లో పంగోల్‌లోని జిఐఐయస్ ప్రాంగణంలో సుమారు 5 గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమానికి సింగపూర్‌లో వివిధ తెలుగు సంస్థల ప్రతినిధులు హాజరవగా, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, శిష్ట్లా వంశీ సాంకేతిక నిర్వహణా బాధ్యతలు వహించి ప్రత్యక్ష ప్రసారాన్ని అందించారు.