పర్యావరణ మార్పులపై ప్రపంచదేశాలు తక్షణమే చర్యలకు పూనుకోవాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ అభ్యర్థించారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడపై గుటెరస్ స్పందించారు. భూమి గ్లోబల్ వార్మింగ్ శకం దాటి గ్లోబల్ బాయిలింగ్ శకంలోకి ప్రవేశించిందని వ్యాఖ్యానించారు. భూమి విధ్వంసక స్థితికి చేరుకున్నదని చెప్పారు. పరిస్థితులు భయానకంగా ఉన్నాయని, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు ముందు నుంచీ హెచ్చరిస్తున్నట్టుగానే, పర్యావరణ విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. శిలాజ ఇంధనాల వినియోగం, పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోకపోవడం ఇక ఏమాత్రం సమ్మతం కాదు అని గుటెరస్ అన్నారు.