ఐర్లాండ్ డబ్లిన్ నగరంలోని సెయింట్ కాథరిన్ పార్క్‌లో ప్రవాస భారతీయులు భగినీహస్త భోజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీరమల్లు కల్యాణ్, అనిత, మాధవి, హిమబిందు, దివ్య మంజుల, లావణ్య, గిరిధర్, సతీశ్ మేడా ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి నరేంద్ర కుమార్ నారంశెట్టి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ కుటుంబంగా నివసించాలని పిలుపునిచ్చారు. ఐర్లాండ్‌లో తొలిసారిగా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని, ఇందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో డాక్టర్ అనూష పులవర్తి, చిన్నారి లక్ష్మి హాసిని ఆలపించిన భక్తి గీతాలు అందరినీ అలరించాయి. రేడియో జాకీ అంకిత పవన్ కార్యక్రమానికి వ్యాఖ్యాత వ్యవహరించారు. ఈ సందర్భంగా పిల్లలకు పద్యాలు, శ్లోకాలతో, తెలుగు భాషలో ప్రావీణ్యం, సాంప్రదాయ దుస్తులు మొదలగు అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఇందులో అక్షద, చరిత, హాసిని, నీల్ అన్వయి, యజ్ఞశ్రీ విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా పలు ఆటల పోటీలు నిర్వహించారు. దివ్య మంజుల ఆధ్వర్యంలో జరిగిన కుటుంబ అన్యోన్యతకు సంబంధించిన పోటీల్లో భాస్కర్ బొగ్గవరపు దంపతులు బహుమతిని అందుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణ పోటీలో గ్రంధి మణి, లావణ్య-మణి దంపతులు గెలుపొందారు. అనంతరం మహేశ్ అలిమెల్ల, గిరిధర్, శ్రీనివాస్, రామ మణికంఠ, అన్వేష్ సహకారంతో విందు ఏర్పాటు చేశారు. సుమారు 70 మందిపైగా ఆర్యవైశ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.