గాన కోకిల, సుమధుర గాయని, భారత రత్న లతా మంగేష్కర్ ఇక లేరు. 1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దీనానాథ్ మంగేష్కర్, శేవంతి మంగేష్కర్ దంపతులకు లతా మంగేష్కర్ జన్మించారు. ఆమె తండ్రి దీనానాథ్‌కు రంగస్థల కళాకారుడిగా, సంగీతకారుడిగా మంచి పేరు ఉండేది. లతకు తండ్రి తొలుత హేమ అనే పేరు పెట్టారు. అది నచ్చకపోవడంతో తాను రాసిన భవబంధన్ అనే నాటకంలోని లతిక అనే పాత్ర ఆధారంగా ఆమె పేరును లతగా మార్చారు. 140 కోట్ల మంది భారతీయులనే గాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను శోకసముద్రంలో ముంచుతూ గంధర్వ లోకానికి మరిలిపోయారు. దాదాపు 80 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు అందరినీ అలరించి, మైమరపించిన ఆమె మధుర గాత్రం శాశ్వతంగా మూగవోయింది. చిన్నా పెద్దా అందరికీ లతా దీదీగా సుపరిచితురాలైన ఈ మెలొడీ క్వీన్ 92 ఏళ్ల వయసులో ముంబైలో కరోనా లక్షణాలు కన్పించడంతో బ్రీచ్‌క్వాండీ ఆస్పత్రిలో చేరిన లత, తర్వాత నిమోనియాతో కూడా బాధపడ్డారు. ఆమె పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. చివరికి కీలక అవయవాల వైఫల్యంతో ఆదివారం ఉదయం 8:12 గంటలకు తుదిశ్వాస విడిచారు.
1948-78 వరకు 30 వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకుది. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా కీర్తి గడిరచిన లతామంగేష్కర్ భారత సినీరంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న (2001) వరించింది. 1987లో అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకుంది. పద్మభూషణ్ (1969), పద్మవిభూషణ్ (1999)తో పాటు అనేకమైన జాతీయ అవార్డులు ఆమె వరించాయి. ప్రఖ్యాత గాయని ఎం.ఎస్.సుబ్బులక్ష్మి తర్వాత భారత ప్రభుత్వం నుంచి ఎక్కువ పురస్కారాలు అందుకున్న గాయకురాలిగా లతా మంగేష్కర్ కీర్తిని పొందింది. రాష్ట్రపతి మొదలుకుని ప్రముఖులంతా లతా మృతి పట్ల ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. కేంద్రం, దేశ వ్యాప్తంగా రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. అధికారిక కార్యక్రమాలన్నింటిని వాయిదా వేశారు














