తెలుగు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాబూరావుకు ఫ్రాన్స్‌లోని ఎకోల్ సుపీరియర్ రాబర్డ్ డీ సోర్బన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తోపాటు భారత్ సమ్మాన్ అవార్డును అందించింది. రిటైర్డ్ డీజీపీ బాబూరావు పోలీసు అధికారిగా ఉన్నప్పుడు ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించారు. దుబాయ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం పెదపూడి గ్రామానికి చెందిన బాబూరావు 1991లో మధ్యప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. అక్కడ వివిధ హోదాల్లో పనిచేసి అదనపు డీజీపీ హోదాలో పదవీ విరమణ పొందారు. మధ్యప్రదేశ్‌లో 36 ఏళ్లపాటు పోలీసు అధికారిగా తన ప్రత్యేకతను చాటారు. అక్కడ కరుడుగట్టిన క్రిమినల్స్‌లో నేర స్వభావాన్ని మార్చడానికి విశేషంగా కృషి చేశారు. అలాగే వివిధ నేరాల్లో చిక్కుకుని జైలుపాలయిన నేరస్థుల కుటుంబ సభ్యులకు అండదండగా నిలిచారు. నేరస్థుల పిల్లల్ని చదవించడమే కాకుండా వారు మంచిమంచి స్థానాలకు చేరుకునేలా ప్రోత్సహించారు.