బెంగళూరు రేవ్‌పార్టీ కేసు లో అరెస్టైన తెలుగు సినీ నటి హేమ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెకు బెయిల్ మంజూరైంది. ఈ కేసుపై విచారణ జరిపిన బెంగళూ రు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
గత నెల మే 19న కర్ణాటక రాజధాని బెంగళూరులో రేవ్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు టీవీ నటీనటులు , మోడళ్లు, బడాబాబులు పట్టుబడ్డారు. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు. డ్రగ్స్ టెస్ట్‌లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. హేమతో పాటు డ్రగ్స్ టెస్ట్‌లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించారు. ఈ కేసులో జూన్ 3న హేమను పోలీసు లు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.