బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న షారూఖ్, శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు టీటీడీ అధికారులు షారుఖ్ ఖాన్కు ఆలయ ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. షారుఖ్, నయనతార జంటగా నటించిన జవాన్ చిత్రం ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.
