ఢిల్లీ లోని తెలంగాణ భవన్‌లో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఉత్సవాలకు హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ బోనాల పండుగను కేంద్ర ప్రభుత్వం ప్రముఖ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నామన్నారు. పంటలను రక్షించాలని, రోగాల నుంచి కాపాడాలని అమ్మవారిని కోరుతూ ఈ వేడుకలు జరుగుతాయన్నారు.
గత ఏడాది నుంచి కరోనా కారణంగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం లేకపోయిందన్నారు. సాధారణ పరిస్థితుల్లో భారీ ఎత్తున మహిళలు, ప్రజలు పాల్గొంటారన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తరపున కిషన్ రెడ్డి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించాలని, కరోనాపై పోరులో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నానని అన్నారు.