హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని ఏ వీధిలో చూసినా బోనాల సందడే కనిపిస్తున్నది. వందేళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారికి ప్రీతికరమైన ఆదివారం నాడు బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు. కరోనా కారణంగా గత ఏడాది బోనాల పండుగను ఇళ్లల్లోనే జరుపుకున్నారు. అయితే ఈ ఏడాది కరోనా ఉధృతి తగ్గడంతో బోనాల పండుగను భక్తులు ఘనంగా జరుపుకుంటూ, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏడు ఆషాడమాసం చివరి వారంలో పాతబస్తీలో బోనాల వేడుకలు జరుగుతుంటాయి. బోనాల పండుగల వేడుకలను పురష్కరించుకుని జంటనగరాల్లో అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనము చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు సూచిస్తున్నారు. ఆలయం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
తెల్లవారుజామున అభిషేకం నిర్వహించగా అలంకరణ అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. వేడుకల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ తొలి బోనం సమర్పించారు. చందూలాల్ బేలలోని మాతేశ్వరి ఆలయం, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం, శాలిబండ, ఉప్పుగూడ, చంద్రాయణగుట్ట, వీరాలం మండి, గౌలిగూడ ప్రాంతాల్లోని ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.