అమెరికాలో కొత్త కొత్త వెర్రులు తలెత్తుతుంటాయి. ఇప్పుడు బోర్గ్ (బ్లాకవుట్ రేజ్ గ్యాలెన్) అనే కొత్త త్రాగుడు ట్రెండ్ అక్కడి యువతను కైపెక్కిస్తోంది. వివిధ హానికారక పదార్థాలతో తయారు చేసే ఈ బోర్గ్ డ్రింక్ ఇప్పుడు అమెరికా కాలేజ్ క్యాంపస్లలో ట్రెండ్ గా మారింది. అల్కాహాల్, వోడ్కా, ఎలక్ట్రోలైట్ పౌడర్, కొన్ని ఫ్లేవర్స్ కలిపి దీనిని తయారుచేస్తుంటారు. సులువుగా త్రాగేలా తీయటి పానీయంగా దీనిని తయారుచేస్తారు. కానీ ఇది తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది. కొందరిలో వాంతులు, ఫిట్స్ వంటివి తలెత్తవచ్చు. అంతేకాక దీర్ఘకాలంలో గుండె, మెదడు సంబంధిత సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ ప్రమాదకర బోర్గ్ డ్రింక్ ప్రాచుర్యంలోకి రాడానికి ప్రధానంగా సోషల్ మీడియా కారణం. ఈ బోర్గ్ త్రాగుడు ట్రెండ్ 2022లో వెలుగుచూసింది. అయితే క్రమంగా అమెరికా అంతటా వ్యాపించింది. కాగా దీనిపై స్థానిక ప్రభుత్వాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అవగాహన సదస్సులు నిర్వహించడంతో కాస్త అదుపులోకి వచ్చిందని తెలుస్తోంది.