భారతీయ నర్సులకు బ్రిటన్కు చెందిన వేల్స్ మెడికల్ బోర్డు తీపి కబురు చెప్పింది. వచ్చే 4ఏళ్లలో ఇండియా నుంచి 900 మంది నర్సులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, కేరళకు చెందిన నర్సులకే ఇందులో తొలి ప్రాధాన్యత ఇస్తామని బోర్డు వెల్లడించింది. వేల్స్లోని స్వాన్సీ బే యూనివర్సిటీ హెల్త్ బోర్డ్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ హాకెట్ ఆదేశాలకు అనుగుణంగా 350 మంది విదేశీ నర్సులను రిక్రూట్ చేసుకోనుంది. 2023-24లో 350 మంది విదేశీ నర్సులను నియమించుకోవడానికి దాదాపు 4.7 మిలియన్ పౌండ్ల (రూ.47.79కోట్లు) ఖర్చవుతుందని అంచనా. విదేశీ నర్సులకు బ్యాండ్ 5 కాంట్రాక్ట్ కింద 27,055 పౌండ్ల (రూ.27.51లక్షలు) ప్రారంభ వేతనంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే, వారు యునైటెడ్ కింగ్డమ్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునే వరకు బ్యాండ్ 4 వేతనాన్ని మాత్రమే ఇస్తారు. ప్రస్తుతం వేల్స్ హెల్త్ బోర్డులో 4,200 మంది నర్సులు, సహాయకులు పనిచేస్తున్నారు. నివేదిక ప్రకారం వీరిలో 1,322 మంది రాబోయే కొన్నేళ్లలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్తో పాటు ఫిలిప్పీన్స్, ఆఫ్రికా, కరేబియన్ దేశాల నుంచి నియామకాలు ఉంటాయని అధికారులు తెలిపారు.