మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన 10 రోజుల తర్వాత ఫడ్నవీస్ సర్కార్ మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ 39 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. సోమవారం నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నాగపూర్‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో, దీనికి ఒకరోజు ముందు మహాయుతి కూటమి మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. మంత్రివర్గంలో బీజేపీ నుంచి 19 మంది, శివసేన-11, ఎన్సీపీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలకు చోటు దక్కింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులేతో పాటు 33 మంది క్యాబినెట్ మంత్రులుగా, మరో ఆరుగురు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మహారాష్ట్ర క్యాబినెట్‌లో గరిష్ట సభ్యుల సంఖ్య 43. తాజా మంత్రివర్గ విస్తరణతో సభ్యుల సంఖ్య 42కు చేరుకుంది. వీరిలో దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ, ఆమె సోదరుడు ధనంజయ్ ముండే, ఎన్‌సీపీ నుంచి ఏకైక ముస్లిం ఎమ్మెల్యే హసన్ ముష్రిఫ్ ఉన్నారు.