విదేశీ ప్రయాణికులకు కెనడా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 30 నాటికి కెనడా ప్రభుత్వం ఈ తీపి కబురును చెప్పే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. కరోనా నేపథ్యంలో కెనడా కూడా విదేశీ ప్రయాణికుల విషయంలో కఠినంగా కొవిడ్ నిబంధనలు అమలు చేస్తూ తమ దేశంలోకి అనుమతించింది. అయితే తాజాగా వీటిపై కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి రావాలనుకునే విదేశీ ప్రయాణికులు ప్రయణానికి ముందు కొవిడ్ టీకా తీసుకోవాలని అనే నిబంధనను ఎత్తివేసేందుకు సిద్ధం అయింది. అంతేకాకుండా ప్రయాణికులకు ఎయిర్ పోర్టులలో జరిపే ర్యాండమ్ కొవిడ్ టెస్టులను కూడా నిలిపి వేయాలని డిసైడ్ అయిందని కెనడాకు చెందిన ఓ ప్రభుత్వ అధికారి వెల్లడిరచారు. వీటితో పాటు మరో కొన్ని కొవిడ్ నిబంధనలను కూడా ఎత్తివేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఆ ఆదేశాలపై ఇంకా కెనడా ప్రధాని సంతకం చేయలేదని వెల్లడిరచారు. ప్రధాని సంతకం అనంతరం సెప్టెంబర్ 30 నాటికి ఇందుకు సంబంధించిన ఆదేశాలు వెలుడనున్నట్లు తెలిపారు.