కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు ఊరట కలిగించింది. వారానికి 20 గంటలకు మించి క్యాంపస్ బయట పని చేయకూడదనే పరిమితిని తొలగించింది. కార్మికుల కొరతకు పరిష్కారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ ఖాళీల రేటు ఏప్రిల్లో గరిష్ఠంగా 6 శాతం ఉండగా, జూలైలో అది 5.4 శాతానికి తగ్గింది. దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతంలోనూ కార్మికుల సంఖ్య కంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్, సిటిజన్షిప్ మంత్రి సీన్ ఫ్రేజర్ చెప్పారు. తాజా నిర్ణయం వల్ల విదేశీ విద్యార్థులకు మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. నవంబరు 15 నుంచి 2023 డిసెంబరు 31 వరకు ఈ వెసులుబాటు అమలులో ఉంటుంది. కెనడాలో సుమారు 10 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.
