బీజేపీ టికెట్ ఇచ్చినా, ఎన్నికల బరిలో దిగడానికి చాలా మంది ఇష్టపడటం లేదు. వ్యక్తిగత కారణాలు అంటూ పోటీ నుంచి వైదొలుగుతున్నారు. సరిగ్గా పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఈ పరిణామాలు ఆ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయి. గుజరాత్‌లోని వడోదర నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ పొందిన రంజన్ బెన్ భట్ వ్యక్తిగత కారణాలను చూపుతూ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమె రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా ఆమెకు టికెట్ దక్కడంతో ఆమె వ్యతిరేక వర్గం పెద్ద ఎత్తున పోస్టర్ల యుద్ధాన్ని ప్రారంభించింది. దీంతో ఆమె పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని, అధిష్ఠానం ఎవరికి అవకాశం ఇచ్చినా, వారి విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు.
గుజరాత్‌లోని శబర్‌కాంత నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం దక్కించుకున్న బీజేపీ నేత భికాజీ ఠాకూర్ కూడా కాడి కింద పడేశారు. వ్యక్తిగత కారణాలను చూపుతూ, పోటీ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు. ఆయన మాజీ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త, ఓబీసీ నేత, 34 ఏండ్ల నుంచి బీజేపీలో ఉన్నారు. లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఆయనకు మొదటిసారి లభించింది. మెహసానా లోక్‌సభ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఇవ్వాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ మొదట కోరారు. కానీ ఆ తర్వాత ఎటువంటి కారణం చూపకుండానే తాను పోటీ చేయబోనని ప్రకటించారు. బీజేపీ ఈ స్థానం నుంచి పోటీ చేసేవారి పేరును ప్రకటించడానికి ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.