దేశంలో పనిసంస్కృతి మారాల్సిన అవసరం ఉన్నదని, యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి సూచించారు. గత రెండుమూడు దశాబ్దాలలో అద్భుతమైన ప్రగతిని సాధించిన దేశాలతో పోటీ పడాలంటే యువకులు ఎక్కువగా కష్టపడక తప్పదని పేర్కొన్నారు. 3వన్4 పాడ్‌కాస్ట్ వారి తొలి ఎపిసోడ్ ది రికార్డ్ లో నారాయణమూర్తి వ్యక్తం చేసిన అభిప్రాయాల వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. జాతి నిర్మాణం, సాంకేతికత, తమ ఇన్ఫోసిస్ కంపెనీతోపాటు అనేక విషయాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్‌లో పని ఉత్పాదకత ప్రపంచంలోనే అతి తక్కువ అని చెప్పారు. చైనా వంటి దేశాలతో పోటీ పడాలంటే దేశ యువత తమ పని గంటలను పెంచాలని, రెండో ప్రపంచ యుద్ధం తరువాత జపాన్, జర్మనీలు అలాగే చేశాయని తెలిపారు. భారత్‌లో పని ఉత్పాదకత తగ్గడానికి ప్రభుత్వంలో అవినీతి, అధికారుల అలసత్వం కూడా కారణమని అభిప్రాయపడ్డారు. ఇది పోనంతవరకు అగ్రరాజ్యాలతో పోటీపడలేమని స్పష్టం చేశారు.