ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఈ ఏడాది తెలుగు సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నది. మే 26 నుంచి 28 తేదీ వరకు న్యూజెర్సీలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈసారి వేడుకల్లో అమర గాయకుడు ఘంటసాల, దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను జరపనున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి మాట్లాడుతూ అమెరికాలో తెలుగు వారి సంక్షేమం కోసం కోసం నిత్యం పనిచేస్తున్నాం. ఈసారి తెలుగు సంబురాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాం. తెలుగు సినిమాకు సేవలు అందించిన ముగ్గురు దిగ్గజాలు ఘంటసాల, ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య గారి శతజయంతి వేడుకలు జరుపబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనేకమంది సినీతారలు న్యూజెర్సీ వస్తుండటం సంతోషంగా ఉంది అన్నారు.
నాట్స్ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని మాట్లాడుతూ ఈ ఏడాది మేము చేస్తున్న ఈ సంబురాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. తెలుగు సినిమాకు ఎంతో గొప్ప సేవలందించిన ఆ ముగ్గురు మహనీయుల శతజయంతి ఉత్సవాలతోపాటు నటులుగా గోల్డెన్ జూబ్లి అంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న జయసుధ, సాయికుమార్‌లను మా వేదికపై సత్కరించి వేడుకలను ఘనంగా చేయాలని మేమందరం నిర్ణయించుకున్నాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సహజనటి జయసుధ, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, నటులు సాయికుమార్, అలీ, ఆది సాయికుమార్‌లతో పాటు అవసరాల శ్రీనివాస్ దర్శకులు ఎ.కోదండరామి రెడ్డి, బి.గోపాల్, గోపిచంద్ మలినేని, సిరాశ్రీ, గాయకులు సింహ, దినకర్ తదితరులు పాల్గొన్నారు.