Namaste NRI

కేంద్రం యూటర్న్‌ … జమిలిపై  వెనకడుగు!

ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై కేంద్రం యూటర్న్‌ తీసుకుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ బిల్లులను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెడతామని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. అయితే తాజాగా రివైజ్‌ చేసిన లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో వీటిని తొలగించారు. లోక్‌సభ కార్యదర్శి విడుదల చేసిన రివైజ్డ్‌ జాబితాలో సోమవారం ఈ రెండు బిల్లులకు సంబంధించిన అజెండాను పెట్టలేదు.

వాస్తవానికి రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంత చట్టాలు (సవరణ బిల్లు)ను సోమవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే దానిని వాయిదా వేసి సోమవారం జాబితా చేసిన ఆర్థిక బిల్లులను సభ ఆమోదించిన తర్వాత ఈ వారం లోనే జమిలి ఎన్నికల బిల్లులు తీసుకురావచ్చునని ప్రభుత్వం తెలిపింది. కాగా, లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో ఈ బిల్లుల అజెండా లేకపోయినప్పటికీ లోక్‌సభ అనుమతితో లెజిస్లేటివ్‌ అజెండా కింద సభలో ప్రవేశపెట్టే అధికారం ప్రభుత్వానికి ఉంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈ నెల 20తో ముగియనున్నందున ఆ సమావేశాలు ముగిసే లోగా జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెడతారని భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News