విదేశీయులకు భారతదేశ వీసా ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న వీసా విధానంలో సమూల మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు ఉన్న 13 ప్రధాన వీసా కేటగిరీలను తొమ్మిదికి, 49 ఉప కేటగిరీలను 23కి తగ్గించింది. అంతేకాకుండా వీసా దరఖాస్తు ఫారమ్‌లో నింపాల్సిన వివరాలను కూడా 65 నుంచి 70 శాతం వరకు తగ్గించింది. విదేశీ పర్యాటకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, వైద్య సేవల కోసం భారత్‌కు వచ్చే వారికి ఈ మార్పులు ప్రయోజనం చేకూర్చనున్నాయి. కొత్త విధానంతో వీసా దరఖాస్తు ప్రక్రియలో గందరగోళం తగ్గడంతో పాటు, దరఖాస్తుల పరిశీలన, వీసాల జారీ వేగవంతం కానున్నాయి.

భారతదేశానికి వచ్చే విదేశీ పౌరుల ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) వీసా విధానాన్ని పునర్వ్యవస్థీకరించింది. గతంలో వేర్వేరుగా ఉన్న కొన్ని వీసా విభాగాలను ఒకే కేటగిరీ కిందకు తీసుకొచ్చింది.

కొత్త విధానంలో తొమ్మిది ప్రధాన వీసా కేటగిరీలు ఉంటాయి.
బిజినెస్ వీసా. డిప్లొమాటిక్ వీసా.ఎంప్లాయ్మెంట్ వీసా. జర్నలిస్ట్ వీసా .మెడికల్ వీసా. అఫీషియల్ వీసా. స్టూడెంట్ వీసా. విజిటర్ వీసా. అదర్ వీసా

ఈ విభజన వల్ల విదేశీయులు తమ ప్రయాణ ఉద్దేశానికి అనుగుణంగా సరైన వీసాను సులభంగా ఎంచుకోవచ్చు. ముఖ్యంగా ఒకే తరహా ప్రయాణ అవసరాలకు సంబంధించిన దరఖాస్తులను ఒకే విభాగంలోకి తీసుకురావడం వల్ల ప్రక్రియ మరింత స్పష్టంగా మారనుంది.















