నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ దసరా. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణలోని సింగరేణి ప్రాంత కథతో నాని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు తాను చేయని సరికొత్త పాత్రలో ఆడియన్స్‌ను అలరించబోతున్నారు. సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అన్ని భాషల్లోనూ ఈ టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మూడో పాటలను విడుదల చేశారు. చమ్కీల అంగీలేసి ఓ వదినే అంటూ సాగే ఈ పాటను ఫోక్ మెలోడీగా మలిచారు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు. దసరా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.