Skip to main content

Namaste NRI

పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించడంలో చంద్రబాబు దిట్ట : పీయూష్ గోయల్

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026 ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం కల్పించడంలో చంద్రబాబు ఎంతో సమర్థుడని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వం లో రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వస్తున్నాయని, పారిశ్రామిక రంగం అభివృద్ధికి అనుకూలమైన విధానాలు అమలవుతున్నాయని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని కేవలం వ్యాపార నిర్వహణ సౌలభ్యానికే పరిమితం చేయకుండా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థాయికి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు, మెరుగైన పారిశ్రామిక వాతావరణం కల్పించడం ద్వారా ఏపీ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తోందని వ్యాఖ్యానించారు.

విశాఖపట్నం అద్భుతమైన నగరమని, సహజ అందాలు, భౌగోళిక అనుకూలతలు, అభివృద్ధికి ఉన్న అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖను అంతర్జాతీయ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఐటీ, విద్య, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ పనితీరును కూడా కేంద్ర మంత్రి ప్రశంసించారు. తనదైన ప్రత్యేక శైలిలో లోకేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. సీఎం చంద్రబాబు నాయకత్వం, మంత్రి లోకేశ్ చొరవతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటోందని పేర్కొన్నారు. సీఐఐ సదస్సు ద్వారా రాష్ట్రానికి మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు వస్తాయనే ఆశాభావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events