ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. మే 28న ఎన్టీఆర్ శతజయంతిని అమెరికాలోని వివిధ నగరాలలో తెలుగు హెరిటేజ్ డేగా ప్రకటించారు. ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 28ని తెలుగు హెరిటేజ్ గా గుర్తిస్తూ ప్రొక్లమేషన్ ఇచ్చారు. టెక్సాస్, ఇలినాయిస్, నార్త్ కెరోలినా తదితర రాష్ట్రాల్లోని వివిధ నగరాలలో జారీ చేసిన ప్రొక్లెమేషన్లను ఎన్‌ఆర్‌ఐ టీడీపీ యూఎస్‌ఏ కో ఆర్డినేటర్ కోమటి జయరాం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణ తదితరులు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమెరికాలో మే 28ని తెలుగు హెరిటేజ్ డే గా గుర్తించటం తెలుగువారందరికీ గర్వకారణమని అన్నారు. ఎన్‌ఆర్‌ఐల మాతృభూమిని గుర్తు చేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. టీడీపీకి అండగా ఉంటూ, పార్టీ అభ్యన్నతికి తోడ్పాటునందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరామ్ ప్రసాద్, రవి మందలపు, కృష్ణ గొంప, సురేష్ కాకర్ల తదితరులు పాల్గొన్నారు.