తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధికి తన వంతు చేయూతగా గల్ఫ్ ఎన్నారై టీడీపీ అధ్యక్షులు రావి రాధకృష్ణ మూర్తి రూ.25 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అమరావతిలో కలుసుకుని ఈ విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసిన రాధకృష్ణ అధినేత ఆశీస్సులు పొందారు. గల్ఫ్ ఎన్నారై టీడీపీ అధ్యక్షుడిగా పార్టీకి అందిస్తున్న సేవలను, పార్టీ సంక్షేమ నిధికి రూ. 25 లక్షలు విరాళంగా అందించడం స్పూర్తిదాయకమని రాధకృష్ణను చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా రాధకృష్ణ మాట్లాడుతూ నిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, సమాజ అభివృద్దే జీవిత ధ్యేయంగా, రాజకీయ విలువలు కలిగిన దార్శనికులు, చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీకి సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు.
తండ్రి ఆశయాలను అందిపుచ్చుకున్న యువ నాయకులు, యువగళం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో నారా లోకేష్ చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. తన చేయూతగా తెలుగు దేశం పార్టీ సంక్షేమ నిధికి రూ.25 లక్షలు విరాళం అందించడం సంతోషంగా ఉందన్నారు.