అమెరికాలో గ్రీన్‌కార్డులో జారీలో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటి వరకు ఒక్కో దేశానికి కోటా ప్రకారం గ్రీన్‌కార్డులు జారీ చేస్తుండగా, ఇక నుంచి ప్రతిభ ఆధారంగా మాత్రమే కార్డులు జారీ చేసే విధానం అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయ్‌మెంట్ (ఈగిల్) యాక్ట్`2022 బిల్లుపై అమెరికా దిగువ సభలో ఈ వారమే ఓటింగ్ జరగనున్నది. ఈ బిల్లు అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కూడా సానుకూలంగా ఉన్నది. బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే చట్టంగా మారినట్టే. ఈ బిల్లు చట్టంగా మారితే దశాబ్దాలుగా వస్తున్న దేశాల కోటాకు ముగింపు పడుతుంది. గ్రీన్‌కార్డు జారీలో దేశాల కోటాను రద్దు చేస్తే అధికంగా లాభపడేది భారతీయులేనని సమాచారం. చైనా నుంచి గట్టిపోటీ ఉన్నప్పటికీ సాఫ్ట్‌వేర్ వంటి రంగాల్లో భారతీయుల హవానే కొనసాగుతున్నది. దీంతో ప్రతిభ ఆధారంగా గ్రీన్‌కార్డులు జారీ చేస్తే అత్యధికంగా భారతీయ అమెరికన్లకే దకుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
