లండన్: తెలంగాణలో విద్యా కార్యక్రమాలు పెద్ద ఎత్తున విస్తరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో శుక్రవారం 900 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించింది.


తెలంగాణతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై ప్రముఖ విద్యావేత్తలతో విస్తృతంగా చర్చించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లోవాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌ను వారికి సమగ్రంగా వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు, చేపడుతున్న చర్యలను వివరించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తమ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, ప్రత్యేక పరిశోధన సామర్థ్యాలు, విస్తృతమైన విద్యా వ్యవస్థను హైదరాబాద్‌కు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణ యువతకు, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్యా, పరిశోధన అవకాశాలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు.
















