
చైనా మరో అద్భుతం చేసింది. పచ్చాని రంగేసినట్టు, ఓ ఎడారిని వనంలా మార్చేసింది. 3,050 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొక్కలు నాటి తక్లమకాన్ ఎడారిని కనుమరుగయ్యేలా అడవిని అభివృద్ధి చేసింది. ఇది జర్మనీ విస్తీర్ణంతో సమానం కావడం గమనార్హం. తద్వారా ఎడారి విస్తరణ, ఇసుక తుఫాన్లను నివారించింది. దశాబ్దాల పాటు చైనా పరిశోధకులు, 6 లక్షల మంది కార్మికులు కలిసి ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఎడారి హైసింత్ సహా అనేక ఔషధ మొక్కలను నాటారు.

ఇవి ఎడారీకరణను ఆపడమే కాదు, ఔషధాలను అందించేందుకు దోహదపడతాయి. ఎడారి మొక్కలకు అందించే నీటి వ్యవస్థకు సౌర విద్యుత్తు అందేలా చేసింది. చైనాలోని అతిపెద్ద రైల్వే లైన్లలో ఒకటైన హోటాన్-రియోగ్జింగ్ మార్గం ఈ ఏడారి గుండా వెళ్తున్నది. ఈ రైల్వే లైన్ సాయంతో ఎర్ర ఖర్జూరా, వాల్‌నట్స్ తదితర పంటల వ్యాపారం కూడా జరుగుతున్నది.
