క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డయలాగ్ (క్వాడ్) దేశాలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఏర్పరుస్తున్న కూటమిపై చైనా మండిపడిరది. ఇలాంటి ప్రాంతీయ కూటములకు తాము వ్యతిరేకమని, దేశాల మధ్య అంతరాలు సృష్టించే పనిని క్వాడ్ మానుకోవాలని సూచించింది. అమెరికా తదితర దేశాలు కోల్డ్‌వార్ మనస్థత్వాన్ని వదులుకోవాలని, ప్రాంతీయ శాంతి స్థాపనకు కలిసిరావాలని కోరింది. ఈ దేశాలు ప్రచ్ఛన్న యుద్ధం మనస్తత్వంతో వ్యవహరిస్తున్నాయని, ఈ ప్రాంతంలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. ఈ నెల 11న మెల్బోర్న్లో క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరగనున్న నేపథ్యంలో చైనా ఈ ఆరోపణలు చేసింది.