కరోనా మహమ్మారి కారణంగా భారత్కు తిరిగి వచ్చిన 1300 మంది భారతీయ విద్యార్థులకు చైనా తిరిగి వీసాలు మంజూరు చేసింది. దీంతో విద్యార్థులు తమ చదువులను పూర్తి చేసే అవకాశం కలిగింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖలోని ఆసియా వ్యవహారాల విభాగం డైరెక్టర్ జనరల్ లియూ జిన్సాంగ్ భారత రాయబారి ప్రదీప్ రావత్తో సమావేశమై, పురోగతిని వివరించారు. 1300 మందికిపైగా భారతీయ విద్యార్థులకు వీసాలు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే, చైనాలోని మెడికల్ కాలేజీల్లో వేలాది మంది భారతీయ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. 23వేల మందికిపైగా విద్యార్థుల పేర్లు చైనీస్ కాలేజీల్లో నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులే. అయితే, గత కొంతకాలంగా భారత విద్యార్థులను తిరిగి అనుమతించాలని చైనాను కోరుతున్నది. గత జూలైలో చైనా విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. విద్యార్థులు తిరిగి కళాశాలకు వెళ్లేలా అనుమతించాలని, ఈ మేరకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని కోరారు. ఈ మేరకు విద్యార్థుల వివరాలను ఎంబసీకి అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య దౌత్యవేత్తలకు మాత్రమే విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి.
