భారతదేశానికి చెందిన ప్రాచీన నాట్య కళా రూపమైన భరత నాట్యం చైనాలో తన ప్రాభవాన్ని చాటుకుంది. పదమూడేండ్ల చైనా బాలిక తన దేశంలో భరతనాట్యం అరంగేట్ర ప్రదర్శనతో అదరగొట్టి సరికొత్త చరిత్ర లిఖించింది. పొరుగు దేశంలో భారత సంప్రదాయ పురాతన కళ ప్రాచుర్యం పొందుతున్న క్రమంలో ఈ ఘటన మైలురాయిగా నిలిచింది. ప్రముఖ భరతనాట్య విధ్వాంసుడు లీలా శాంసన్, భారత దౌత్యవేత్తలు, చైనా భరతనాట్య అభిమానులు సహా పలువురి ప్రముఖుల సమక్షంలో చైనా బాలిక లీ ముజి భరతనాట్యంలో తన తొలి ప్రదర్శన చేపట్టింది.చైనాలో ఇది తొలి భరతనాట్య స్నాతకోత్సవ ఘట్టంగా నమోదైంది. నృత్య కళాకారిణి తన గురువులు, నిపుణులు, అతిధుల సమక్షంలో ఇచ్చే తొలి ప్రదర్శనే అరంగేట్రం. చైనా నృత్య కళాకారిణి లీ భరతనాట్య అరంగేట్ర ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. చైనాలో పూర్తిస్ధాయి శిక్షణ అనంతరం ఆ దేశంలో పెర్ఫామ్ చేసిన తొలి అరంగేట్రం ఇదేనని భారత రాయబార కార్యాలయ కల్చర్ ఇన్‌చార్జ్ టీఎస్ వివేకానంద్ తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/08/Mayfair-72.jpg)
భరతనాట్య ప్రదర్శన పూర్తిగా భారత సంప్రదాయాలకు అనుగుణంగా జరిగిందని ఆయన వివరించారు. చైనా గురువు వద్ద శిక్షణ పొందిన విద్యార్ధుల్లో లీ అరంగ్రేటం మొదటిదని, భరతనాట్య వారసత్వ పరంపరలో ఇది కీలక మైలురాయి అని చైనాలో భరతనాట్య డ్యాన్సర్, లీ మెంటర్ జిన్ షన్ షన్ పేర్కొన్నారు. రెండు గంటల పాటు లీ పలు క్లాసికల్ కంపోజిషన్స్‌ను అలవోకగా నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/08/Ixora-73.png)