సినిమా పరిశ్రమను, సామాన్య ప్రజలను వణికిస్తున్న కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్స్, డిజిటల్ మోసాలపై మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా నవంబర్ 2న మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం వల్ల తలెత్తుతున్న అనర్థాలపై ఆయనతో విస్తృతంగా చర్చించారు. అప్పట్లో ఈ అంశంపై స్పందించిన చిరు, తమ ఆందోళనలను అమిత్ షా సానుకూలంగా అర్థం చేసుకున్నారని, ఈ విషయాన్ని తక్షణమే పరిశీలించి కఠినమైన చట్టాలు, శిక్షలు ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు, తాజాగా చిరంజీవి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నేరుగా కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. ఏఐ సాంకేతికతను అడ్డుపెట్టుకుని అసాంఘిక శక్తులు సృష్టిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలను అణచివేయడానికి అత్యంత కఠినమైన రక్షణ చర్యలు తక్షణమే అవసరమని ఆయన గట్టిగా కోరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుని ఈ అంశాలను సత్వరమే ముందుకు తీసుకెళ్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.

సమాజంలోని ప్రతి పౌరుడి డిజిటల్ భద్రతను పరిరక్షించడం సమిష్టి బాధ్యత అని చిరంజీవి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ రోజురోజుకూ పెరుగుతున్న డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.















