అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ విలియమ్ బర్న్స్ తాలిబన్ల నాయకత్వంతో రహస్య చర్చలు జరిపారు. ఇందుకోసం అమెరికా నుంచి కాబూల్‌కు చేరుకున్నారు. కాబూల్ విమానాశ్రయంలో రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు ఆఫ్ఘన్లు దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించబోమని తాలిబన్లు ప్రకటించారు. ఖతార్‌లో ఇంతకుముందు జరిగిన చర్చలకు సారధ్యం వహించిన తాలిబన్ల నేత అబ్దుల్ ఘనీ బరాదర్‌తో విలియమ్ బర్న్స్ సమావేశమైనట్లు సమాచారం. ఆప్ఘన్ సంక్షోభంపై జీ`7 దేశాల అధినేతలు చర్చించనున్న నేపథ్యంలో కాబూల్‌లో విలియమ్ బర్న్స్ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆగస్టు 31 లోపు సేనలు ఆప్ఘనిస్థాన్ వీడి వెళ్లాల్సిందేనని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తాలిబన్లు హెచ్చరించిన నేపథ్యంలో వారితో సీఐఏ డైరెక్టర్ విలియమ్ బర్న్స్ రహస్యంగా సమావేశం కావడం గమనార్హం. తాలిబన్లతో విలియమ్ బర్న్స్ ఏం చర్చించారన్న సంగతి వెల్లడి కాలేదు.