లెజండరీ సింగర్, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట అంటే ఇష్టపడని వారుండరు ఆయన పాటకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. తెలుగు వారికి పాటంటే బాలునే కొన్నివేల పాటలు ఆలపించిన బాలు అనారోగ్యంతో గతేడాది కన్నూమూసినప్పటికీ పాట రూపంలో ఆయన ఇంకా మన మధ్యే జీవించిం ఉన్నారు. అందుకు నిదర్శనమే ఇప్పటికి ఆయన పాడిన పాటలు పలు వేదికలపై మారుమ్రోగిపోవడం. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో వేలాది గీతాలతో సినీ, సంగీత ప్రియుల్ని రంజింపజేసిన వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అందుకే తెలుగు వారికి పాటంటే బాలు మాటంటే బాలు. జూన్ 4న ఆయన జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సినీ మ్యుజీషియన్స్ యూనియన్ బాలుకి ప్రేమతో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 100 మంది సినీ గాయకులతో ప్రత్యేక పాటల కచేరి నిర్వహించనుంది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షుడు ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ మా అందరికీ వృతిగత జీవితం ఇచ్చిన వ్యక్తి బాలుగారు. ఆయనంటే మాకు ప్రాణం. జూన్ 4న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 12 గంటల పాటు సంగీత విభావరిని నిర్వహిస్తూ వేడుక చేయనున్నాం. ఇలా పాటల కచేరితో ఆ మహనీయుణ్ని గుర్తు చేసుకోవటాన్ని మేమందరం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమానికి పాటతో పాటు, బాలు గారి అభిమానులతో పాటు ఆయన మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని తెలిపారు.
