ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికిగాను ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును అందుకున్నారు అగ్ర దర్శకుడు రాజమౌళి. న్యూయార్క్‌లో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవ వేడుకకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హాజరై అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి సినిమా తనకు ఓ దేవాలయం లాంటిదని అన్నారు. ఈ అవార్డు దక్కినందుకు ముందుగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి, హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను ఏ స్థాయి విజయాల్ని అందుకున్నా నా కుటుంబానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. నా ఉన్నతిలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై భారతీయులు ఎలాగైతే ప్రేమాభిమానాల్ని కనబరిచారో..అదే స్థాయి ఉత్సాహాన్ని విదేశాల్లో చూశానని రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. ఓ సన్నివేశాన్ని తెరకెక్కించే ముందు ప్రేక్షకుడిలా ఆ సీన్ గురించి ఆలోచిస్తానని, కథలోని ఉద్వేగాలు అందరికి కనెక్ట్ కావాలని కోరుకుంటానన్నారు. న్యూయార్క్, చికాగోలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి వచ్చిన స్పందనను థియేటర్లలో ప్రత్యక్షంగా చూశాను అని రాజమౌళి పేర్కొన్నారు.