అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో వలస విధానంపై ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆందోళన అమెరికాకు వలస వెళ్లిన వారిలో నెలకొన్నది. ముఖ్యంగా తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కడంపై అనిశ్చితి నెలకొంటుందనే భయం వలస వెళ్లిన వారిలో మొదలైంది. అమెరికాలో జన్మించిన పిల్లలకు జన్మతా అక్కడి పౌరసత్వం లభిస్తుంది. దీనిని నాచురలైజ్డ్ సిటిజన్‌షిప్ అంటారు.
అయితే, తాము గెలిస్తే మొదటి రోజే నాచురలైజ్డ్ సిటిజన్‌షిప్‌ను ఎత్తేస్తామని తమ ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వారి ప్రచార పత్రాల్లోనూ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇక మీదట అమెరికాలో జన్మించే పిల్లలకు జన్మతా పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో ఒక్కరైనా కచ్చితంగా అమెరికా పౌరులై లేదా చట్టప్రకారం అమెరికా శాశ్వత నివాసితులై ఉండాలని ఆదేశాలు ఇస్తాం అంటూ ట్రంప్ ఎన్నికల ప్రచార పత్రంలో పేర్కొన్నారు. ప్రచారంలో చెప్పినట్టు ఆయన ఈ నిర్ణయం తీసుకుంటే ఇక మీద అమెరికాకు వలస వెళ్లిన వారి పిల్లలకు జన్మతా పౌరసత్వం దక్కదు.