ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు అట్లాంటా లో ఘనంగా జరిగాయి. కమ్మింగ్ లోని సానీ మౌంటైన్ ఫార్మ్స్ ఎన్టీఆర్ విగ్రహ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గుడివాడ శాసనసభ్యులు రాము వెనిగండ్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబును గుండెల్లో పెట్టుకొని పూజిస్తానని అన్నారు. పనికిమాలిన వ్యక్తులను టార్గెట్ చేయడానికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ప్రజల మంచి కోసం కష్టపడి పనిచేయడమే చంద్రబాబు బలమని అన్నారు. ప్రవాసాంధ్రులు చంద్రబాబు పి.4లో భాగస్వాములు కావాలని పిలుపిచ్చారు.

చంద్రబాబు పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ప్రాముఖ్యమైన రోజని, గత ఏడాది పర్యటనలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చోటే చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలను తీర్చడానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందు నిలబడుతూ, రాష్ట్ర తలరాతను మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న మహోన్నత వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. ఖండాంతరాలు దాటి పుట్టినరోజు వేడుకలు జరుగుతుండడమే చంద్రబాబు గొప్పతనానికి నిదర్శనమని అన్నారు.

తెలుగు ప్రజలందరూ రుణపడి ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు అని, మోడ్రన్ హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేశారో ప్రపంచ స్థాయిలో అమరావతి లాంటి గొప్ప నగర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. మనం చేసే పనులు భవిష్యత్తు తరాలకు ఎలా ఉపయోగపడతాయో అని నిరంతరం ఆలోచిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ప్రజలకు ఏం మంచి చేయాలో అని నిరంతరం ఆలోచిస్తారని అన్నారు. చట్ట ప్రకారంగానే వ్యవహరించాలనేదే చంద్రబాబు ఆలోచన అని చెప్పారు.

గత ప్రభుత్వం తనకు చేసిన అన్యాయాలను చంద్రబాబు దిగమింగి, ఏపీ రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం ఇలా ప్రజలకు ఏం కావాలో వాటి కోసమే ఆయన కష్టపడుతున్నారని అన్నారు. ప్రజల మంచి కోసం కష్టపడి పనిచేయడమే చంద్రబాబు బలమని అన్నారు. ఎన్టీఆర్ తనకు ఆరాధ్యదైవం అయితే, చంద్రబాబును గుండెల్లో పెట్టుకొని పూజిస్తానని మరొక సారి అన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగువారి అభివృద్ధిని చూసి, చంద్రబాబు ఎంతో గర్వంగా చెబుతారన్నారు. చంద్రబాబు 2047 విజన్‌లో మనందరం భాగస్వామ్యులమవుదామని పిలుపిచ్చారు. చంద్రబాబు ఆలోచనలే, రేపటి భావితరాల అభ్యున్నతికి వారదులుగా మారుతున్నాయని, చంద్రబాబు విజన్ నుండి పుట్టుకొచ్చిన ఆలోచనలే నేడు దేశం మొత్తం అమలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు వందేళ్లపాటు ఇదే ఉత్సాహంతో పనిచేసి, తెలుగు వారందరిని ముందుకు తీసుకెళ్లాలి అని అన్నారు.
