తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలో వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజూ కొనసాగింది. యాగంలో ఈరోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహించారు. కేసీఆర్ దంపతులు స్వయంగా ఈ పూజలో పాల్గొన్నారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములతో పాటు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ యాగ క్రతువును పర్యవేక్షించారు.
యాగశాలలో ఈరోజు రాజశ్యామల అమ్మవారు శివకామ సుందరీ దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. యాగంలో మొత్తం మూడు లక్షలకు మించి రాజశ్యామల మూల మంత్రాలను హవనం చేస్తారు. అలాగే 11 సార్లు శూలినీ దుర్గ కవచ పారాయణ ఉంటుంది. సర్వ లోక సంరక్షణార్ధం ఇంద్ర సూక్త హోమం, నవగ్రహ సూక్త హోమం నిర్వహిస్తారు. షడావరణ సహిత మూల మంత్రాలతో సుబ్రహ్మణ్య కవచ యాగం కూడా నిర్వహిస్తారు. తెలుగు రాష్ర్టాలతోపాటు తమిళనాడు, కర్ణాటక నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన 170 మంది పండితుల ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించారు.