రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజును రాజకీయాలకు అతీతంగా పండుగల జరుపుకోవాలి అని అన్నారు. అలాగే ఎవరైనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కించపరచాలి అని అనుకుంటే, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై ప్రతి ఏడాది డిసెంబర్ 9న ఉత్సవాలు జరపాలని నిర్ణయించాం. గత పదేళ్లలో తెలంగాణ తల్లి వివక్షకు గురైంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్లు, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, తదితరులు పాల్గొన్నారు.
జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీటీ. గంగాధర్ తెలంగాణ తల్లి చిత్రాన్ని గీయగా, ప్రముఖ శిల్ప కళాకారుడు ఎంవీ రమణారెడ్డి కాంస్య విగ్రహంగా తీర్చిదిద్దారు. అభయహస్తం, బిగించిన కొంగు, చేతిలో పంటలు, బంగారు రంగు అంచు ఉన్న పచ్చటి చీరతో కూడిన తెలంగాణ తల్లి విగ్రహం 17 అడుగులు కాగా, బిగించిన పిడికిళ్లు చేతులతో నిలబెట్టుకుంటున్న సంకేతంతో మూడడగుల గద్దెతో కలిపి మొత్తం 20 అడుగుల విగ్రహం సిద్ధమైంది.