ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిమ్లా పర్యటన వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో బిజీగా ఉండే జగన్ కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఈ మేరకు ఆయన కొంత సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపనున్నారు.ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిమ్లా టూర్‌కు వెళ్లారు. తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి తన ఫ్యామిలీతో కలిసి చండీగఢ్, అక్కడి నుంచి సిమ్లాకు బయలుదేరి వెళ్లారు. వ్యక్తిగత అవసరాల నేపథ్యంలోనే సీఎం సిమ్లాలో పర్యటించనున్నారు.
సిమ్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. సీపీ బత్తిన శ్రీనివాస్, డీసీపీ హర్షవర్ధన్, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి జగన్ వివాహం జరిగిన ఆగస్టు 28 సరిగ్గా 25 ఏళ్లు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ టూర్ ప్లాన్ చేసుకున్నారని సమాచారం. ఆగస్టు 26 నుంచి 31 వరకూ ఆయన కుటుంబంతో అక్కడే గడపనున్నారు. సెప్టెంబర్ 1న ఆయన తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు.