ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం పర్యటనకు వెళ్లారు. ప్రాజెక్టు పురోగతిని తెలుసుకునేందుకు పోలవరం పరిసరాల్లో వివాంగ వీక్షణం ద్వారా పనులను ఆయన పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పనులపై ఆయన అడిగి తెలుసుకున్నారు. స్పిల్ వే పనుల ఛాయా చిత్రాలను జగన్ పరిశీలించారు. పనుల తీరును ఈఎస్సీ నారాయణరెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో జగన్ సమీక్షించారు. అంతకుముందు పోలవరం వ్యూ పాయింట్ వద్ద నుంచి గోదావరి నదీ ప్రవాహ మార్గాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశీలించి వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం వైఎస్ జగన్తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అధికారులు ఉన్నారు.