ఆగస్ట్ 31 వరకు అప్గానిస్తాన్‌లో తమ మిలటరీ మిషన్ పూర్తవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. మేము వెళ్లింది ఆఫ్ఘనిస్తాన్ జాతి నిర్మాణం కోసం కాదు, ఆప్ఘన్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకుంటారు. అది వారి బాధ్యత, హక్కు కూడా. దేశాన్ని ఎలా నడిపించాలో వారికి తెలుసు అని బైడెన్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌పై ఏకపక్షంగా దాడి చేసిన అమెరికా అక్కడ అపారమైన విధ్వంసం సృష్టించడం మినహా సాధించిందేమీ లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో బైడెన్ ఈ ప్రకటన చేశారు. 20 ఏళ్లుగా అఫ్గాన్‌లో అమెరికా చేపట్టిన సైనిక కార్యక్రమానికి లక్ష కోట్ల డాలర్ల వరకు ఖర్చు అయిందని అన్నారు. 2,448 మంది యూఎస్ సైనికులు చనిపోయారని, 20 వేల మందికి పైగా గాయాల పాలయ్యారని బైడెన్ తెలిపారు. మరో తరం అమెరికన్లను అఫ్గానిస్తాన్‌కు పంపించబోమన్నారు. అమెరికా దళాలు వెళ్లిపోయిన తరువాత అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు పూర్తిగా ఆక్రమించుకుంటారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి దిగజారుతోందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ సివిల్ వార్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చింది.