చైతన్యరావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం షరతులు వర్తిస్తాయి. కుమారస్వామి (అక్షర) దర్శకత్వం. ఈ చిత్రాన్ని స్టార్‌లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. షరతులు వర్తిస్తాయి చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అగ్ర నిర్మాత దిల్ రాజు హాజరు కాగా, దర్శకుడు వేణు ఊడుగుల, తెలంగా ణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ మామిడి హరికృష్ణ గారితో నాకు బలగం సినిమా టైంలో పరిచయ మైంది. ఆయన ఆహ్వానం మేరకు రవీంధ్రభారతికి వెళ్లి సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వారికి కల్చరల్ డిపార్ట్‌మెంట్ ఇస్తున్న శిక్షణ చూసి ఆనందపడ్డా. షరతులు వర్తిస్తాయి సినిమాను మంచి కాన్సెఫ్ట్‌తో తీశారు. బలగం కంటే ఎక్కువగా తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కించారు అన్నారు. మామిడి హరికృష్ణ మాట్లాడుతూ సహజమైన కథా కథనాలతో కొత్త సినిమాటిక్ లిబర్టీ తీసుకొని రూపొందిన చిత్రమిది. సినిమా చేయాలనే కలతో గోదావరిఖని ప్రాంతం నుంచి వచ్చిన కుమారస్వామి కల నెరవేరబోతున్నది అని చెప్పారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ వనమాలి, శేఖర్ పోచంపల్లి, సంగీతం: అరుణ్ చిలువేరు, నరేశ్ బొబ్బిలి, నిర్మాతలు: శ్రీలత, నాగార్జున సామల, శారద, శ్రీష్‌కుమార్ గుండా, విజయ, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు, రచన-దర్శకత్వం: కుమారస్వామి.