దుబాయ్‌లో జరుగుతున్న కాప్-28 సమావేశాల్లో కలకలం చెలరేగింది. మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కాంగుజమ్ అనే 12 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా చర్చా వేదికపైకి వచ్చి పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. అంతేగాక శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా వేదికపై ప్లకార్డును ప్రదర్శించింది. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం కారణంగా భూమి సగటు ఉష్ణోగ్రతలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. అంతేకాదు, ఈ పరిణామం ఫలితంగా భవిష్యత్తులో అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయని, సముద్ర మట్టాలు పెరిగిపోయి తీర ప్రాంతాల్లోని ముంబై వంటి నగరాలు మునిగిపోతాయని శాస్త్రవేత్తలు చాలాకాలం నుంచి హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లిసిప్రియ శిలాజ ఇంధనాలపై తన వ్యతిరేకతను స్పష్టంచేస్తూ నినాదాలు చేయడంతో కొంత సమయం అక్కడ గందరగోళం నెలకొంది.
ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చిన లిసిప్రియ ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా శిలాజ ఇంధనాల వాడకాన్ని వెంటనే తగ్గించాలని నినదించింది. చర్చలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న వ్యక్తి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా అందరికీ వివరించింది. ఇంతలో ఇద్దరు భద్రతాసిబ్బంది లిసిప్రియను వేదిక పైనుంచి పక్కకు తీసుకెళ్లారు.














